Site logo

ప్రైవేట్ ఆస్పత్రుల మీద వస్తున్న ఫిర్యాదులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష

ప్రైవేట్ ఆస్పత్రుల మీద వస్తున్న ఫిర్యాదులు, వివిధ పత్రికలలో వస్తున్న వార్తల నేపథ్యంలో సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా చికిత్సకు ధరలు నిర్ణయించినప్పటికీ మందుల పేరుతో, పి పి ఈ కిట్ల పేరుతో, ఐసీయూ చార్జీలు, వైద్య సిబ్బందికి అధిక జీతాల పేరుతో అడ్డగోలుగా ప్రజల మీద భారం మోపడం తగదని మంత్రి అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై వస్తున్న ఫిర్యాదులపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు .
వైద్యం అందించాల్సిన బాధ్యత మర్చిపోయి ప్రైవేట్ ఆసుపత్రులు లాభాల కోసం మానవతా దృక్పదం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమయంలో ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యాపార కోణంలో ఆలోచించకుండా, ప్రజల ప్రాణాలు కాపాడటం లో తమ వంతు బాధ్యత పోషించాలని కోరారు.
ప్రజల భయాన్ని సొమ్ము చేసుకోవడం తగదని అన్నారు. సాధారణ పరిస్థితి కంటే పది రేట్లు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ కి ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు మంత్రికి వివరించారు.
ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఫిర్యాదులపై విచారణ జరిపించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఫీజులు అమలు జరిగేలా చర్యలు తీసుకోవటం , బెడ్స్ ఖాళీలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక అందించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
బెడ్స్ లేవని కృత్రిమ కొరత సృష్టించి ప్రజల నుంచి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడం..
మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు అడ్వాన్స్ లేనిదే చేర్చుకొక పోవడం…
రోజుకి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల దాకా బిల్లులు వసూలు చేయడం …
రోగి మృతి చెందిన కూడా మానవతా దృక్పథం లేకుండా చార్జీలు చెల్లిస్తే తప్ప మృతదేహం అప్పగించటం లేదు…
ఏ మాత్రం కూడా లక్షణాలు లేని వారిని కూడా అడ్మిట్ చేసుకుని విపరీతంగా చార్జీలు వసూలు చేయడం..
పేషెంట్ సీరియస్ కాగానే అంబులెన్స్లో పడవేసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు అంటూ వచ్చిన ఫిర్యాదులపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ నేపధ్యంలో కమిటీ విస్తృతంగా పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వచ్చిన మొదటి రోజునుండి వైద్య ఆరోగ్య శాఖ శక్తి వంచన లేకుండా పనిచేస్తుంది అని మంత్రి తెలిపారు.
వివిధ ప్రభుత్వ హాస్పిటల్స్ లు, మెడికల్ కాలేజీ హాస్పిటల్స్ , జిల్లా హాస్పిటల్ లో ఐ సి యూ లు, వెంటిలేటర్ బెడ్లు, ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.
కరోనా చికిత్సకు అవసరమైన అధునాతన, ఖరీదైన మందులు అన్నింటిని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచామన్నారు.
ప్రజలు కరోనా గురించి భయపడకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి ఉచితంగా వైద్యం చేయించుకోవాలని కోరారు.
ఈ సంక్షోభ సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు తమ సామాజిక బాధ్యతగా ప్రజలకు సేవలు అందించడానికి మరియు కరోనాను జయించిన డానికి ప్రభుత్వంతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ప్రైవేట్ ఆస్పత్రుల కు ఉన్న ఇబ్బందులను తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే ప్రజలపై అధిక భారం పడకుండా చూడాలని మరో మారు కోరారు.

Comments

  • No comments yet.
  • Add a comment