Site logo

Jammikunta History | Karimnagar District | Telangana

Jammikunta Inscription | Pesarubanda | karodgiri | Pedda Mill | Mainer Water | Kamal Takies | Educational Institutions | Telephone Facilities | Hospitals | Gramapanchayath | Train Route | Gandhi Chowk | Rachabanda | Vavilala Khadi | Temples | Sri Seetharama Chandra Swamy Temple, Ellandakunta | Bijigirisharief Dargah | Bommalagudi | Venkateshwara Swamy Temple | Panchamukhi Hanuman Temple

జమ్మికుంట చరిత్ర

కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట ఒక ముఖ్యమైన పట్టణం. దీని చుట్టూ ఉన్న సుమారు 40 గ్రామాలకు ఇది కూడలి.పిల్లలు తమ చదువుల కోసం, రైతులు మార్కెట్ కోసం ఈ గ్రామాల ప్రజలు జమ్మికుంటకే రాకపోకలు సాగిస్తారు. జమ్మికుంట నుండి వివిద ప్రాంతాలను కలుపుతూ రోడ్డు మార్గాలున్నాయి. జమ్మికుంటకు రైలు సౌకర్యం కూడా ఉంది. హైదరాబాదు,చెన్నయ్ లనుండి కొత్తడిల్లీ వెళ్ళే కొన్నిరైళ్ళు ఇక్కడ ఆగుతాయి. ఈమధ్య కాలంలో ప్రైవేటు రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. హైదరాబాదు తర్వాత అత్యధిక వాహానాలు కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాయి. అందువలన జమ్మికుంట నిత్యం వచ్చి పోయే వారితో రద్దీగా ఉంటుంది.

సుమారు 50 వేల జనాభా గల జమ్మికుంట నగరపంచాయితీగా, ప్రస్తుతం మున్సిపాలిటీ గా మారింది.

గ్రామీణ ప్రాంతమే అయినా పట్టణ లక్షణాలు ఉన్నాయి.ఇది హుజూరాబాదు అసెంబ్లీ,కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడి వ్యవసాయ మార్కెట్ తెలంగాణలోని పెద్ద మార్కెట్లలో ఒకటి. కాటన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పత్తి మార్కెట్ కూడా ఉంది. నేటి జమ్మికుంటకు ఘనమైన చరిత ఉంది.

జమ్మికుంట శాశనం:

పాత జమ్మికుంట చెరువు కట్ట దగ్గర శివాలయం ముందు ఒక చారిత్రక శాశనం ఉంది.

దీనిని పశ్చిమ చాళుక్య రాజు అహోమల్లదేవుడు 10 వ శతాబ్దంలో వేయించాడు.ఇతను రెండవ తైలపునిగా ప్రసిద్దుడు. పారమార రాజ్యమైన ఉప్పాలపై దండెత్తి విజయం సాధించిన సంధర్భంగా ఈ శాశనం వేయించారు. శాశనం ప్రకారం క్రీ.శ. 995 ఏప్రిల్ 5 వ తేదీన దీనిని వేయించారు.

జమ్మికుంటకు చెందిన నాగాయగవుడ అనునతను తన స్వంత రెండు ఎకరముల తరి భూమి పది బిగముల మెట్ట భూమిని, పూర్వం రాజ పరంపరగా వచ్చి ఊరి మధ్య గల 20 బిగముల మూడు ఎకరముల మెట్ట భూములను రెండు రత్నములను బహూకరించి ఈ దీపవృక్షమనే శాశనాన్ని వేయించాడు.ఆ తర్వాత వీరి వంశస్థులు పూజారులుగా కొనసాగారని ఇప్పటి ‘పూదరి’ ఇంటిపేరుగల వారు వీరి వంశస్థులని ఒక అభిప్రాయం. ఇప్పటి రంగమ్మపల్లి-జగ్గయ్యపల్లి గ్రామాలకు పశ్చిమాన ఒక గ్రామం ఉండేదని అది అప్పటి సైనిక స్థావరమని తెలుస్తున్నది. శాశనంలో జమ్మికుంట పేరు “దమ్మెకుంటె” అని ఉంది. ఇది చాళుక్యలకు ముందు భౌద్ధ మత ప్రాభల్యం గల ప్రాంతం కాబట్టి దమ్మి అనే సంస్కృత పదం, కుంటె అనే కన్నడ పదాల కలయిక ద్వారా ఈ పేరు వచ్చింది. దమ్మి అంటే తామర, కుంటె అనగా కొలను అని అర్థం. కాలక్రమలో దమ్మేకుంటె జమ్మికుంట అయింది.

పెసరుబండ:

ప్రస్తుత నగరపంచాయితీ కార్యాలయం తూర్పు భాగాన ఒక పెద్ద బండరాయి ఉండేది. అది చదునుగా వెడల్పుగా దినుసులు ఎండబెట్టుకోవడానికి అనువుగా ఉండేది. తరచుగా దానిపై పెసల్లు ఎండబోసే వారని, క్రమంగా దాన్ని పెసరుబండగా పిలిచేవారని వృద్దతరం వారు చెప్తున్నారు. కొంతకాలం దానిపైనే దినుసుల కొనుగోలు, అమ్మకాలు జరిగినవి. తర్వాత నేటి కూరగాయల మార్కెట్ ప్రదేశం గ్రేన్ మార్కెట్ గా కొంతకాలం పనిచేసింది.

ఆ తర్వాత 1950 లో ప్రస్తుతం ఉన్న గ్రేన్ మార్కెట్ ఏర్పాటయింది. హైదరాబాదు ప్రధాన మంత్రి శ్రీ .ఎం . కె.వెళ్లొడి 6.2.1950 రోజున ప్రారంబించారు.

ప్రస్తుతం ప్రత్తి మినహా మిగతా దినుసుల మార్కెట్ గా పని చేస్తున్నది. ఇది 1990 లో రెగ్యులేషన్ అయింది. ప్రత్తి కోసం కాటన్ కార్పొరేషన్ సహకారంతో కొత్త మార్కెట్ నిర్మాణం జరిగింది.

కరోడ్ గిరి:

ప్రస్తుతం రైల్వే స్టేషన్ వద్దగల పోలీస్ స్టేషన్ స్థలంలో ఒకప్పుడు హాస్పిటల్ ఉండేది. హాస్పిటల్ కంటే పూర్వం దాన్ని కరోడ్ గిరి అని పిలిచే వారు. రైలు మార్గం ద్వారా దిగుమతి అయ్యే వస్తువులు అక్కడ భద్రపరిచి, అక్కడ నుండి సంభందిత వ్యాపారులు తీసికెళ్ళేవారు. బ్రిటీష్ పాలిత ప్రాంతం నుండి వచ్చే సరుకులపై నిజాం ప్రభుత్వం పన్నులు కట్టించుకునే చెక్ పోస్ట్ లాంటి ప్రదేశం కరోడ్ గిరి. నిజాం ప్రభుత్వం పసుపు రంగు పెట్టెలను వాడేవారు. ముసాఫీర్ ఖానా కూడా ఇంచుమించు ఇదే ప్రదేశంలో ఉండేది. బాటసారులకు విశ్రాంతి నిలయమే ముసాఫీర్ ఖానా.

ఖాసీం రజ్వి: నిజాం కాలంలో ఖాసీం రజ్వి రజాకార్ల నాయకునిగా ఉన్నాడు. అతను భయంకరమైన వ్యక్తిగా పేరు గాంచాడు. 1946-48 మద్య కాలంలో అతను జమ్మికుంటను సందర్శించగా జమ్మికుంటలోని ఆనాటి పెద్దలు ఖాసిం రజ్వీకి పూలమాలతో సన్మానం చేశారు.

ఆర్య సమాజ్: తెలంగాణ రైతాంగ పోరాట సమయంలో నిజాం వ్యతిరేక ఆందోళన సమయంలో “ఆర్య సమాజ్” శాఖ జమ్మికుంటలో చురుకుగా పనిచేసింది.

పెద్ద మిల్లు:

జమ్మికుంట వ్యాపార ప్రస్థానం 1924 లో ఉప్పుడు బియ్యం మిల్లుతో మొదలయింది. కొండూరి,వారితోపాటు, గుజరాతీ, మార్వాడి ,పట్కారి కుటుంబాలకు చెందిన వారు మొట్టమొదట ఇక్కడ వ్యాపారాలను ప్రారంబించారు.గేటు కింద అటుకుల మిల్లు పరిసర పాత తరం గ్రామస్తులకు సుపరిచితమే. ప్రస్తుతం అన్నపూర్ణ ధియేటర్ దగ్గర అప్పుడు మార్వాడి వారి పరమేశ్వరదాస్ “సరస్వతి ఆయిల్ మిల్లు” ఉండేది. కొందరు బంగారం వ్యాపారం చేసేవారు. అప్పుడు సూరజ్ మార్క్ గోల్డ్ పేరుగాంచిన బంగారం బ్రాండ్. అప్పట్లో పట్కారి కుటుంబాలవారు బట్టల దుకాణాలు నడిపేవారు. గ్యాస్ నూనె గోపయ్య గారిదే మొదటి పెట్రోల్ పంప్.

మానేర్ నీళ్ళు:

జమ్మికుంట కు మొదటి నుంచి మంచినీళ్ళ ఇబ్బంది ఉంది. దీనిని అధిగమించేందుకు జమ్మికుంటకు 16 కిలోమీటర్ల దూరంలోని విలాసాగర్ సమీపాన గల మానేర్ నది నుంచి పైప్ పైన్ల ద్వారా నీటిని అందించే ప్రణాళిక తయారు చేశారు. దీని రూపకర్తలలో ప్రముఖులు సరాజు రాంగోపాల్ రావు గారు (విలాసాగర్) పరిపాటి జనార్ధన రెడ్డి (కల్లుపల్లే) డా. ఎర్రంరాజు నర్సింహారాజు గారు(పాత జమ్మికుంట) పింగిలి గోపాల్ రెడ్డి గారు (కోరపల్లి). ఈ ప్రణాళికను సుసాధ్యం చేసినది ఆనాటి మన మంత్రి కె.వి. నారాయణ రెడ్డి.

కమల్ టాకీస్:

ప్రస్తుతం కూరగాయల మార్కెట్ దగ్గర కమల్ టాకీస్ ఉండేది. అదే మొదటి ధియేటర్. దీనిని ఎక్కటి అన్నారెడ్డి నిర్మించారు. ఆ తర్వాత పింగిళి గోపాల్ రెడ్డి రత్నకళా మందిర్ నిర్మిస్తే 1971 లో అయిత మల్లయ్య గారు హరిహర ధియేటర్ నిర్మించారు.

విద్యాసంస్థలు:

జమ్మికుంటలో 1948 లోనే ప్రభుత్వ పాఠశాల స్థాపించారు. 1965 లో ఆదర్శ డిగ్రీ కాలేజీ, 1973 లో శిశుమందిర్,1976 లో ప్రైవేటు రంగంలో శ్రీనివాస ఇంగ్లీషు మీడియం స్కూలు మొదలైంది.

టెలిఫోన్ సౌకర్యం:

టెలిఫోన్ సౌకర్యం జమ్మికుంట కంటే ముందు వీణవంకలోనే ఉండేదట. పాడి సుధాకర్ రెడ్డి గారి సహకారంతో జమ్మికుంటకు విస్తరించబడింది.

హాస్పిటల్:

ప్రభుత్వం 1934-49 మధ్యకాలంలో జమ్మికుంటలో ప్రభుత్వం ఒక “శానిటేషన్ యూనిట్”ను నడిపిండి. దీనినే 1954-55 సంవత్సరంలో “డిస్పెన్సరి ”గా మార్చింది. నేటి పోలీస్ స్టేషన్ స్థలంలో ఇది ఉండేది. ఆ తర్వాత కాలంలో నేడున్న “ప్రభుత్వ సివిల్ హాస్పిటల్” గా ఏర్పాటయింది.

గ్రామ పంచాయితీ:

1953 నుండి 1964 వరకు జమ్మికుంట ఎక్స్-టౌన్ మున్సిపాలిటిగా ఉండేది. ఈ కాలంలో డిప్యూటీ సివిల్ అడ్మినిస్ట్రేటర్ గా వీరస్వామి నాయుడు పని చేశారు. పోలీస్ స్టేషన్ పాతజమ్మికుంటలోనే 1980ల వరకు ఉన్నది. మున్సిఫ్ కోర్టు హుజూరాబాదులో ఉండేది. జమ్మికుంటను 1964 లో మేజర్ గ్రామ పంచాయితీగా మార్చారు. మొదట కొలిశాల నర్సయ్యగారి బంగాళా ఆ తర్వాత రావికంటి తిరుపతయ్యగారి ఇల్లు పంచాయితీ ఆఫీసుగా సేవలందించాయి. సర్పంచులుగా పరమేశ్వర దాసు, నేదాండ్ల చంద్రయ్య, అయిత చంద్రమౌళి, భగవాన్ రెడ్డి, పత్తి జగ్గా,రెడ్డి కృష్ణం రాజు పలకల సత్య నారాయణ రెడ్డి, కామిశెట్టి మల్లయ్య, పోనగంటి మల్లయ్య, ఎర్రంరాజు సురేందర్ రాజు, శంకరయ్య వంటివారు పని చేశారు. 2011 లో నగర పంచాయితీగా మార్చారు. ఛైర్మన్ గా పోడేటి రామస్వామి గారు పని చేస్తున్నారు.

పాత నగరపంచాయితీ స్థలంలో మొదట బాలికల ప్రాథమిక పాఠశాల ఉండేది. ప్రస్తుత బాలికల పాఠశాల స్థలం పిల్లల ఆట స్థలం మరియు గార్డెన్ ఉండేది. ఎక్స్ మునిసిపాలిటీ గా ఉండాలంటే గార్డెన్ తప్పనిసరి.

రైలు మార్గం

ఈ మార్గంలో రైల్వే లైను రావడం, బెల్లంపల్లి పరిసర ప్రాంతాలలో బొగ్గుగనులు ఏర్పడడం వలన జమ్మికుంట ముందు ముందు పెద్ద పారిశ్రామిక నగరంగా మారుతుందని గ్రహించిన నిజాం ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం ఇచ్చి చాలా భూములను సేకరించింది. అలా సేకరించిన భూమినుండే 20 ఎకరాలు ఆదర్శ కాలేజీకి, బాలికల స్కూలుకు 3 ఎకరాలు, గ్రేన్ మార్కెట్ కు 14 ఎకరాలు, ఆవాస విద్యాలయానికి 10 ఎకరాలు, పోస్ట్ ఆఫీస్ కు 100క్x100 టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కి ఒక ఎకరం, శిశుమందిర్ కు30 గుంటలు, వేంకటేశ్వర దేవాలయానికి 2 ఎకరాలు, గీత మందిర్ కు 50క్x70 మరియు 25క్x50 స్థలాలు, సాయి మందిర్ కు 75క్x75 స్థలం, బొమ్మల గుడికి 3 ఎకరాలు,అదే విధంగా రాధాస్వామి సత్సంఘం, గ్రంధాలయానికి, బస్టాండ్ కు స్థలాలు కేటాయించారు.

గాంధీ చౌక్:

హైదరాబాదు-కొత్త డిల్లీ రైలు మార్గంలో మొదటి రైల్వే లైను 1931-32 లో వేశారు. ఆ సమయంలో మహాత్మా గాంధీ ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్నట్టు తెలియంతో చుట్టుపక్కల గ్రామస్తులు ఎడ్ల బండ్లు కట్టుకుని రైల్వే స్టేషనుకు వచ్చారు. జమ్మికుంటలో కొన్ని నిమిషాలు పాటు రైలు ఆపి ప్రజలను ఉద్దేశించి గాంధీజీ మాట్లాడారు .

దానికి గుర్తుగానే 1946 ఫిబ్రవరిలో గాంధీ చౌక్ నిర్మాణం జరిగింది. రైల్వే స్టేషన్ రాకతో దీన్ని స్టేషన్ జమ్మికుంట అని, పాత జమ్మికుంటను అబాది జమ్మికుంట అని పిలువటం మొదలైంది. పోస్టల్ శాఖ వారు ఏ కారణం చేతనో ఖదీమాబాదు అని పాత జమ్మికుంటను వ్యవహరిస్తారు.అబాది అంటే అభివృద్ది చెందిన బస్తి అని అర్థం.

గాంధీ విగ్రహ ప్రతిస్థాపన జైహింద్ పేరున జరిగింది. దీనికి రావికంటి శంకరయ్య కార్యదర్శిగా ఉన్నారు. గాంధీ విగ్రహ ఏర్పాటుకు ఈ క్రింది దాతలు విరాళాలు ఇచ్చారు.
రూ. 3000 జమ్మికుంట వర్తక సంఘం
రూ. 1200 బందెల్లి రాజపారు గారు
రూ. 1025 శ్రీ కొండూరు రామలింగం గారు
రూ. 1025 శ్రీ కొండూరు బుచ్చిరాజలింగం గారు
రూ. 1025 శ్రీ. కొండూరు మంకయ్యలింగం గారు
రూ. 1025 సరస్వతి ఆయిల్ అండ్ రైస్ మిల్
రూ. 1025 వరంగల్ ఇండస్ట్రీస్ అండ్ కొ లిమిటెడ్
రూ. 1000 శ్రీ ఎన్. బాలయ్య గారు, హైదరాబాదు
రూ. 516 కరండ్ల జగన్నాథం గారు
రూ. 516 సామల దుర్గయ్య అండ్ నర్మెట్ట దక్షిణామూర్తి, వరంగల్
రూ. 516 కె. కనకయ్య గారు, చెలుపూరు

విగ్రహాన్ని మద్రాస్ (చెన్నయ్) నుండి తెప్పించారు. కరీంనగర్ జిల్లా అడ్మినిస్ట్రేటర్ శ్రీ ఎ. సత్యనారాయణ మూర్తి గారు తేదీ. 3.11.1949న శంకుస్థాపన చేశారు. హైదరాబాదు ప్రభుత్వ ప్రధాన మంత్రి శ్రీ. ఎం.కె. వెళ్లొడి గారిచే 5.2.1950న ఆవిష్కరించబడింది.

కృషి విజ్ఞాన కేంద్రం: ప్రకాశం కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో 1992 లో ఏర్పాటయింది. దీనిని గ్రామ నవ నిర్మాణ సమితి అనే స్వచ్చంద సంస్థ స్థాపించించింది. ఇది భారత వ్యవసాయ పరిశోధనా మండలి, కొత్త డిల్లి వారి సహకారంతో పనిచేస్తున్నది.

రచ్చబండ పేరుతో జమ్మికుంటలో ఒక పత్రిక

రచ్చబండ: రచ్చబండ పేరుతో జమ్మికుంటలో ఒక పత్రిక నడిచేది.కర్నే చిరంజీవి అనే న్యాయవాది ఈ పత్రికను నడిపేవారు.1980-90 దశకాలలో ఇది నడిచింది.

వావిలాల ఖాది:

గాంధీజీ పిలుపు మేరకు అఖిల భారత చరకా సంఘ్ లో భాగంగా 1924 లో దీనిని ప్రారంబించారు. 1983 ఖాదీ గ్రామోద్యోగ ప్రతిస్తాన్ గా ఆవిర్భవించింది. 1983 నుండి 2004 వరకు పి.వి. నరసింహా రావు గారు దీనికి ఛైర్మన్ గా ఉన్నారు. 1989 ఆగస్ట్ 15 న రాజీవ్ గాంధీ వావిలాల ఖాదితో తయారైన మువ్వన్నల జెండాను ఎగురవేశారు. దేనికి ఎన్నో అవార్డులు వచ్చాయి.

పురాతన దేవాలయాలు:

ఇల్లందకుంట లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం

ఇల్లందకుంట లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం కూడా పురాతనమైనదే. దీని నిర్మాణ సమయం అలభ్యం. 1931లో పి.వి. నరసింహా రావు గారి వివాహం ఇందులోనే జరిగింది.
 

ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం

క్రీ.శ. 700-800—సంవత్సరాల కాలంలో పరిపాలించిన పశ్చిమ చాళుక్యులు నిర్మించారని ఒక వాదన. క్రీ.శ. 1330 ల నాటి కాకతీయులు నిర్మిచారని మరో వాదన ఉంది.

బిసుగిరి దర్గా

బిసుగిరి దర్గా గా పిలువబడే హజ్రత్ అలీ, రహమతుల్లా వలీ సమాధులు సుమారు 800 సంవత్సరంలో నిర్మించారు.

శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం (బొమ్మలగుడి) 1939 లో నిర్మించారు.

పెసరుబండ రాళ్ళు దీనికి వాడారు. 1950 ల ప్రాంతంలో హనుమాన్ టెంపుల్ ను అనుగం కుటుంబీకులు నిర్మించారు. 1996 లో అయ్యప్ప దేవాలయాన్ని నిర్మించారు.
ఈ మధ్య కాలంలో వేంకటేశ్వర ఆలయాన్ని, పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించారు.

Courtesy: Dr.Pulluri Sampath Rao